World Cup 2023: ఈడెన్ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఆటగాళ్ల బ్యాట్లు, కిట్లు

World Cup 2023: ఈడెన్ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఆటగాళ్ల బ్యాట్లు, కిట్లు

ఐకానిక్ స్టేడియం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2023 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బుధవారం రాత్రి(ఆగస్ట్ 9) స్టేడియంలో మరమ్మత్తు పనులు చేస్తుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చాయి. 

ALSO READ : ఇండియా టాప్‌‌ షో..పాకిస్తాన్​​పై ఘన విజయం

నివేదికల ప్రకారం.. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోని ఫాల్స్ సీలింగ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. డ్రెస్సింగ్ రూమ్‌లోని అనేక పరికరాలు కాలి బూడి దయ్యాయని సమాచారం. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు లేవు. క్రికెటర్లు తమ సామ్రగ్రిని భద్రపర్చుకోవడానికి ఈ గదిని వాడుతుంటారు. మంటల ధాటికి గదిలోని ఫర్నీచర్‌తో పాటు ఆటగాళ్ల బ్యాట్లు, కిట్లు ధగ్ధమయ్యాయని సమాచారం.

ఈ విషయం తెలియగానే క్రికెట్ అసోసియేషన్ బెంగాల్(క్యాబ్) జాయింట్ సెక్రటరీ దేవ్రత్‌దాస్ మైదానానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబి) దర్యాప్తు ప్రారంభించింది.

5 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న ఈడెన్ గార్డెన్స్

ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 28న నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్ అక్టోబర్ 31న పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య, మూడో మ్యాచ్ నవంబర్ 5న దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య, నాలుగో మ్యాచ్ నవంబర్ 11న ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ ఐకానిక్ గ్రౌండ్‌లో నవంబర్ 16న సెమీ ఫైనల్ పోరు కూడా జరగనుంది.